Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 8

"King decides to perform Yaga for obtaining children"

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

ఓమ్ తత్ సత్
తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః
సుతార్థం తప్యమానస్య నాశీద్వంశకరః సుతః ||

ఆ ప్రభావశాలియు , ధర్మజ్ఞుడు , మహాత్ముడు అయిన దశరథమహారాజుకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేనిపోవుటచే సుతునికోసము తపనపడిపోవుచుండెను

బాలకాండ
ఎనిమిదవ సర్గ

ఆ ప్రభావశాలియు , ధర్మజ్ఞుడు , మహాత్ముడు అయిన దశరథమహారాజుకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేనిపోవుటచే సుతునికోసము తపనపడిపోవుచుండెను.

ఆ విధముగా చింతించుచున్న ఆ మహరాజుకు " సుతుని కొఱకై అశ్వమేధయాగమును ఎందుకు చేయకూడదు" అని అలోచన కలిగెను. అప్పుడు ధర్మాత్ముడైన ఆ మహరాజు మిక్కిలి బుద్ధిమంతులగు మంత్రులందరితోనూ సమాలోచనచేసి యాగము చేయుట తగును అను నిశ్చయమునకు వచ్చెను. పిమ్మట అ మహరాజు మంత్రిసత్తముడైన సుమంత్రునితో పురోహితులతో సహా గురువులందరినీ తీసుకురమ్మని ఆదేశించెను. అప్పుడు సుమంత్రుడు ఆ క్షణమే త్వరగా వెళ్ళి సమస్త వేదపారంగతులైన వారినందరినీ తీసుకువచ్చెను . వారు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి , కాశ్యపుడు , పురోహితముఖ్యుడైన వశిష్ఠుడు తదితర బ్రాహ్మణోత్తములు.

వారినందరినీ పూజించి ఆ దశరథమహారాజు ధర్మార్థములతో కూడిన ఈ మథుర వచనములను పలికెను.

" పుత్రుని కొఱకై తపించుచున్న నా మనస్సువలన నాకు సుఖములేకున్నది. అందుకోసము అశ్వమేధ యాగము చేయవలెనని నా కోరిక . ఆ యాగమును శాస్త్రోక్తమగు కర్మలతో చేయుటకు కోరిక గలవాడను. ఈ కోరిక నాకు ఎట్లు ప్రాప్తము కాగలదో అని మీరు విచారించవలెను " అని దశరథమహారాజు పలికెను.

అప్పుడు వశిష్టుడు మొదలగు బ్రాహ్మణోత్తములు ఆ మహరాజు పలికిన వచనములకు "బాగు బాగు" అని చెప్పి సంతశించిరి. సంతశించి వారందరూ దశరథమహరాజుతో ఈ విధముగా పలికిరి. " ఓ రాజా ! యాగమునకు కావలసిన సామగ్రులను తెప్పించుడు . యజ్ఞాశ్వమును విడువుడు. సంతానప్రాప్తికై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది. కావున మీ అభిలాషానుసారము మీరు పుత్రులను పొందుదురు" అని.

అప్పుడు ఆ మహరాజు ఆ ద్విజోత్తములవాక్యములను విని మిక్కిలి సంతోషపడి అనందాశ్రువులను రాల్చుచూ మంత్రివర్యులతో ఇట్లనెను. "మా గురువులు ఆదేశించిన విధముగా యాగమునకు కావలసిన వస్తువులను సమకూర్చుడు. యాగముచేయు ఋషులు వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడువుడు. సరయూ నదికి ఉత్తరభాగమున యాగభూమిని సిద్ధపరచుడు. విఘ్ననివారకుములైన శాంతి కర్మలను యథావిథిగా జరిపింపుడు. ఈ యజ్ఞమును ఆచరించుటలో అపచారములుగాని కష్టములుగాని లేకున్నచో రాజులందరునూ ఈ యాగము చేసెడివారే . విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యాగకర్మలో దోషములు వెదుకుదురు. వారు యాగము భంగపఱచుటకు ప్రయత్నించుచుందురు. యాగము భంగపడినచో యాగకర్త వెంటనే నశించును. మీరు కార్యనిర్వహణలో నిపుణులు. అందువలన నేను సంకల్పించిన ఆ అశ్వమేధయాగము లోపములు లేకుండా యధావిథిగా పరిసమాప్తమగునటుల చూడుడు ".

ఆ మంత్రులందరూ మహరాజుయొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచూ ప్రభువుల ఆదేశప్రకారము చేయుదము అని పలికిరి. ధర్మజ్ఞులైన ఆ ద్విజోత్తములందరూ దశరథమహారాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞనుగైకొని తమతమ నివాసములకు పోయిరి.

ఆ బ్రహ్మణోత్తములకు వీడ్కోలు పలికి పిమ్మట మహరాజు అమాత్యులకు ఋత్విజుల ఆదేశప్రకారముగా యాగద్రవ్యములను సిద్ధపఱచమని చెప్పెను. ఆ మహారాజు ఆవిథముగా పలికి అచట నున్న అమాత్యులను పంపి వేచి తన మందిరమును ప్రవేశించెను.

పిమ్మట ఆ మహారాజు తనప్రియపత్నులకడకేగి ," పుత్రప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని మీరునూ దీక్షతీసుకొనుడని పలికెను.

మిక్కిలి సంతోషకరమైన ఆ మాటలకు అ రాణుల ముఖపద్మములు మంచుతొలగినపిమ్మట వికశించు కమలములవలె శోభిల్లెను.

|| ఓమ్ తత్ సత్ ||

తాసాం తేనాతి కాంతేన వచనే సువర్చసామ్|
ముఖపద్మాన్యశోభంత పద్మానివ హిమాత్యయే ||

" మిక్కిలి సంతోషకరమైన ఆ మాటలకు అ రాణుల ముఖపద్మములు మంచుతొలగినపిమ్మట వికశించు కమలములవలె శోభిల్లెను".